1911లో బెంగాల్ విభజన రద్దు: బీహార్, బెంగాల్‌లు సొంత రాష్ట్రాలుగా ఏర్పడటం వంటివి మద్రాసు ప్రెసిడెన్సీలోని ఆంధ్రులపై అత్యంత ప్రభావం చూపాయి. 1912లో నిడదవోలులో కృష్ణాజిల్లా సదస్సు జరిగింది. అందులో జొన్నవిత్తుల గురునాథం ఆంధ్రులకు ప్రత్యేక జిల్లాలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని తీర్మానించి, ఆనాటి ప్రభుత్వానికి విన్నవించారు. ఇది ఆ సదస్సులో ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పటి వరకు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే స్ఫూర్తి లేదు. ఆ తీర్మానాన్ని కొందరు వ్యతిరేకించారు. కానీ, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జొన్నవిత్తుల గురునా«థం గుంటూరులో తన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి వింజమూరి భావనాచార్యులు, కొండా వెంకటప్పయ్య కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
|
ఆంధ్ర ఉద్యమం ఆశయాలువిద్య ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడం, ప్రభుత్వానికి విన్నపాల ద్వారా తెలియపర్చడం.
ఆంధ్రదేశంలో వ్యవసాయం, వాణిజ్య, వ్యాపార పరిస్థితులపై తులనాత్మక పరిశీలన జరపడం, ప్రజల్లో సహకార భావాలు పెంపొందించడం. పరిశుభ్రత, ఆరోగ్యం, సాంఘిక పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించడం. తెలుగు భాషను, సాహిత్యాన్ని అభివృద్ధి పథంలోకి తేవడం, వీటిని పుస్తక రూపంలో ముద్రించి సామాన్యులకు అందుబాటులో ఉంచడం. సామాన్య ప్రజలకు ముఖ్య సేవలు అందించడం. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని జొన్నవిత్తుల గురునాథం కరపత్రాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
ఐదు సదస్సులు.. ప్రత్యేక రాష్ట్ర తీర్మానంమొదటి ఆంధ్రమహాసభ 1913లో గుంటూరు జిల్లాలోని బాపట్లలో బీఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది. అదే సమయంలో ఆంధ్రమహాసభ స్థాపకులైన జొన్నవిత్తుల గురునాథం మరణించారు.
మొదటి ఆంధ్రమహాసభ తీర్మానాలు: ఒక విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఆరోగ్య కళాశాలలు, మరికొన్ని ఇతర కళాశాలలు ఆంధ్రాలో ప్రారంభించాలని, విశాఖపట్నంలో ఓడరేవు నిర్మించాలని తీర్మానించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని వేమవరపు రామదాసు చేసిన తీర్మానాన్ని ఎం.ఆదినారాయణయ్య తదితరులు వ్యతిరేకించారు. ఈ విషయంపై తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. చివరకు పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన ఆంధ్రా కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ ప్రజాభిప్రాయం సేకరించాలని, తెలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. పట్టాభి సీతారామయ్య రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలను సందర్శించారు. అయితే గుత్తి కేశవ పిళ్ళై, దొరైస్వామి అయ్యంగార్లు (చిత్తూరు), గోపాలస్వామి మొదలియార్ (బళ్లారి) వంటి వారు దీన్ని వ్యతిరేకించారు. అత్యధిక మంది ప్రజలు, మేధావులు గొప్ప సహకారం అందించారు. 1913 జూన్‌లో విశాఖపట్నం, చిత్తూరు సదస్సుల్లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని తీర్మానించారు.
రెండో ఆంధ్రమహాసభ సదస్సు 1914 మేలో బెజవాడలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయం ద్వారా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కావాలని తీర్మానించారు.
మూడో ఆంధ్రమహాసభ సదస్సు పానగల్ రాజా అధ్యక్షతన 1915లో విశాఖపట్నంలో జరిగింది. ఇందులో మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నాలుగో ఆంధ్రమహాసభ సదస్సు 1916లో దివాన్ బహదూర్ మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన కాకినాడలో జరిగింది. ఐదో ఆంధ్రమహాసభ సదస్సు 1917లో కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన నెల్లూరులో జరిగింది. ఈ ఐదు ఆంధ్రమహాసభ సదస్సులు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానించాయి.
వినతులు, కొనసాగిన సదస్సులు1918లో ఇండియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మాంటేగు ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంటు బృందం భారత్‌ను సందర్శించింది. భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలని, దీనిలో భాగంగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో మోచర్ల రామచంద్రరావు, పట్టాభి సీతారామయ్య, భూపతిరాజు వెంకటపతిరాజు, నెమలి పట్టాభిరామారావు, సీవీఎస్ నరసింహరాజు, కొండా వెంకటప్పయ్య, వీరూరు పిచ్చయ్య లాంటి నాయకులు మాంటేగుకు వినతిపత్రం అందించారు.
1919లో భారత జాతీయ కాంగ్రెస్ ఈ తీర్మానాలను తిరస్కరించింది. దీంతో కొంతకాలం పాటు నాయకులు రాజకీయ పోరాటాలకు దూరమయ్యారు. అయితే గతంలో ఆంధ్రమహాసభల తీర్మానాల ప్రకారం విశాఖపట్నంలో మెడికల్ కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపించారు. రాజమండ్రి, అనంతçపురంలలో కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రుడైన వేపా రామేశం మద్రాసు హైకోర్టులో మొట్టమొదటి జడ్జీగా నియమితులయ్యారు. ఆ సమయంలో జస్టిస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజల్లో చైతన్యం తేవడానికి ఏటా కడప, అనంతçపురం, మహానంది, బెర్హంపూర్, చిత్తూరు, మద్రాసు, మచిలీపట్నం, ఏలూరు, మళ్లీ అనంతపురంలలో ఆంధ్రమహాసభలు జరిగాయి. ఆల్ ఆంధ్రా కోపరేటివ్ లిటరరీ సభలను పెద్ద ఎత్తున నిర్వహించారు. 1919 నాటి మాంటేగు, లార్డ్ చెమ్స్‌ఫర్డ్ యాక్ట్ ప్రకారం భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని 1927లో వేమవరపు రామదాసు స్టేట్ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. పిల్లలమర్రి ఆంజనేయులు ఈ తీర్మానాన్ని మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మద్రాసు కౌన్సిల్‌లో 1928లో అయ్యదేవర కాళేశ్వరరావు గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 1928లో సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటించింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. మొదటి రౌండ్ టేబుల్ సదస్సును కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. 1931లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన మద్రాసులో ప్రత్యేకాంధ్ర సదస్సు నిర్వహించారు. అందులో భాషా ప్రాతిపదికన ప్రత్యేక తెలుగు జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లండన్‌లో జరగనున్న రెండో రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరయ్యే సందర్భంలో మహాత్మాగాంధీకి ఈ తీర్మానాన్ని అందజేశారు. జోగయ్య పంతులు, వి. నాగభూషణం, పీవీ సుబ్బారావు, కె.నరసింహారావులు ప్రత్యేకాంధ్ర ఏర్పాటు కోసం లండన్ వెళ్లారు. 1934లో దేశపాండ్య సుబ్బారావు ఇంగ్లండ్ వెళ్లి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేశారు. అయినా ఫలితం లేకపోయింది. భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఎన్ని తీర్మానాలు చేసినా, సదస్సులు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. దీనికి పరిష్కారం కోసం చివరకు 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. 1937లో ఆంధ్రమహాసభ సిల్వర్ జూబ్లీ సదస్సు విజయవాడలో కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది. 1937లో మద్రాసు ప్రావిన్సులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు కాంగ్రెస్ ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని అందజేసింది.
శ్రీబాగ్ ఒప్పందం
1937లోనే రాయలసీమ, తూర్పు తీరాంధ్ర నాయకుల మధ్య విభేదాలొచ్చాయి. దీని పరిష్కారం కోసం 1937లో శ్రీబాగ్ ఒప్పందం కుదిరింది. కాశీనాథ నాగేశ్వరరావు పంతులు స్వగృహమే శ్రీబాగ్. ఇక్కడే సమావేశం జరిగినందువల్ల దీన్ని శ్రీబాగ్ ఒప్పందంగా పరిగణించారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రా–రాయలసీమ ప్రాంతాల్లో రెండు విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తూర్పు తీరాంధ్ర జిల్లాలతో సమానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నీటిపారుదల, వ్యవసాయం అభివృద్ధి చేయడానికి కనీసం పదేళ్లు పడుతుంది. అందుకోసం తుంగభద్ర, కృష్ణ, పెన్నా నదీ జలాల సద్వినియోగానికి ప్రాజెక్టులు నిర్మించాలి.
1938లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భాషా ప్రాతిపదికన ఆంధ్రా, తమిళ, కేరళ, కర్ణాటక ప్రాంతాలను మద్రాసు ప్రావిన్సు నుంచి విడదీసి, మద్రాసు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీన్ని కొండా వెంకటప్పయ్య, పి.మల్లికార్జునుడు ప్రవేశపెట్టారు. అయితే అప్పటి గవర్నర్ లార్డ్ ఎస్కైన్ ఆంధ్రా ముఖ్యపట్టణం మద్రాసులోనే ఉండాలని మెలిక పెట్టారు.
ఈ సందర్భంలో 20వ ఆంధ్రమహాసభ సదస్సు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన మద్రాసులో జరిగింది. జస్టిస్ సర్.ఎం.వెంకట సుబ్బారావు దీన్ని ప్రారంభించారు. ఇందులో 1937నాటి శ్రీబాగ్ ఒప్పందానికి చిన్న సవరణ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజకీయ రాజధానిగా ఉంటుందని సవరించారు. ఈ సంఘటనతో ఆంధ్రదేశం అంతటా ఉద్యమాలు జరిగాయి. సి.రాజగోపాలాచారి మంత్రివర్గం నుంచి ఆంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని అనేక ఉద్యమాలు, సదస్సులు నిర్వహించారు. 21వ ఆంధ్రమహాసభ గుంటూరులో 1939లో జరిగింది. దీనికి అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షత వహించారు. ఆరు నెలల్లోగా ప్రత్యేకాంధ్ర రాకుంటే మంత్రులు రాజీనామాలు చేయాలని, పన్నులు కట్టకూడదని ఈ సదస్సులో తీర్మానించారు. 1941, నవంబర్‌లో 22వ ఆంధ్రమహాసభ సదస్సు విశాఖపట్నంలో జరిగింది. విజయనగరం మహారాజా సర్ విజయకుమార్ రాజా దీనికి అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రా ప్రావిన్షియల్ కాంగ్రెస్ సభ్యుడు, మద్రాసు ప్రావిన్షియల్ కాంగ్రెస్ మాజీ మంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు హాజరయ్యారు. మద్రాసులో ఆంధ్రా రాజధాని ఉండాలనే గవర్నర్ లార్డ్ ఎస్కైన్ అభిప్రాయాన్ని ప్రకాశం పంతులు ఈ సదస్సులో విమర్శించారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకివస్తే ప్రత్యేకాంధ్ర వస్తుందని, తుంగభద్ర నదిపై ప్రాజెక్టు నిర్మాణమవుతుందని, రాయలసీమను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ప్రకాశం చేసిన తీర్మానాన్ని ఈ సదస్సులో ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ సందర్భంగా విజయనగర రాజా సర్ విజయకుమార్ మహాత్మాగాంధీని కలిసి ప్రత్యేకాంధ్ర ఏర్పడాలని విన్నవించారు. స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశం వచ్చినప్పుడు ఆయనతో సమావేశమై ఒక వినతి పత్రం అందించారు. అలాగే అప్పటి మద్రాసు ప్రావిన్సు గవర్నర్ లార్డ్ హోఫేని కలిశారు. 23వ ఆంధ్రమహాసభ సదస్సు సర్ విజయకుమార్ అధ్యక్షతన 1943లో బళ్లారిలో జరిగింది. |
Latest News
ఆంధ్ర మహాసభలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment