¤ భారత జీడీపీ వృద్ధి అంచనాల కంటే బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. 2019, 2020ల్లో భారత వృద్ధి మందగిస్తుందని గత జులైలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ రెండేళ్లకు వృద్ధి రేటును 0.3 శాతం కోత వేసి వరుసగా 7 శాతం, 7.2శాతంగా అంచనా వేసింది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని, చైనా కంటే చాలా ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. ¤ ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఆగస్టులో భారత ఎగుమతులు 6.05% తగ్గి 26.13బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.83 లక్షల కోట్ల)కు చేరాయి. దిగుమతులు 13.45% తగ్గి 39.58 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.77 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 13.45 బి.డాలర్లుగా నమోదైంది. 2016 ఆగస్టులో దిగుమతులు 14 శాతం క్షీణించాక, ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం 30 కీలక రంగాల్లో 22 ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ¤ భారత్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్)ఔషధ ఎగుమతులు ఆకర్షణీయంగా నమోదయ్యాయి. ఈ మూడు నెలల్లో 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.35,500 కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతి చేసినట్లు ఫార్మాగ్జిల్ (ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆసియా దేశాలను మినహాయించి మిగిలిన అన్ని దేశాలకు జరిగిన ఎగుమతుల్లో వృద్ధి లభించినట్లు ఆయన వెల్లడించారు.
|
No comments:
Post a Comment