¤ దేశంలోని పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్నోసార్లు ఈ విషయం గురించి స్పష్టం చేసినా, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదని ఆక్షేపించింది. ఈ విషయంలో గోవా అద్భుత ఉదాహరణగా ఉందని పేర్కొంది. అక్కడ కొన్ని పరిమిత హక్కుల పరిరక్షణ మినహా మతాలకు అతీతంగా అందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉందని వివరించింది. ‘‘దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఫలితాలు దక్కేలా చూసేందుకు రాజ్యాంగంలోని 44వ అధికరణ ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఆశించినా ఇప్పటివరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. హిందూ చట్టాలను 1956లో క్రోడీకరించినప్పటికీ పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగలేదు'' అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధా బోస్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. గోవా గతంలో పోర్చుగీసు వలసరాజ్యంగా ఉంది. అందువల్ల అక్కడ పోర్చుగీసు చట్టాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మూలాలున్న వ్యక్తికి గోవా వెలుపల ఉన్న ఆస్తుల వారసత్వం విషయంలో పోర్చుగీసు చట్టాలు వర్తిస్తాయా లేక వారసత్వ చట్టం వర్తిస్తుందా అన్న మీమాంసపై ధర్మాసనం పరిశీలన జరుపుతూ తాజా వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో పోర్చుగీసు పౌర స్మృతి-1867 మాత్రమే వర్తిస్తుందని తీర్పు చెప్పింది. దీనిపై భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించినందువల్లే పోర్చుగీసు పౌర స్మృతి గోవాలో అమలవుతోందని పేర్కొంది. ¤ అంతర్జాతీయ స్థాయిలో, కఠిన మార్గదర్శకాలకు అనుగుణంగా భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సైన్యానికి అందుబాటులోకి వస్తున్నాయి. వందకు పైగా దేశాల్లో ఆదరణ పొందిన ఈ కవచాలు అధునాతన తూటాల నుంచి మన సైనికులను రక్షించనున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ తర్వాత తూటా రక్షణ కవచాలకు సంబంధించి స్వీయ జాతీయ ప్రమాణాలను కలిగిన దేశంగా భారత్ అవతరించింది. దేశ రక్షణ బలగాల కోసం 1.86 లక్షల జాకెట్లు సరఫరా అయ్యాయి. ఏకే-47 తుపాకీ నుంచి సెకెనుకు 700 మీటర్ల వేగంతో దూసుకొచ్చే హార్డ్‌స్టీల్ కోర్ తూటాల నుంచి కూడా ఈ కవచాలు రక్షణ కల్పిస్తాయి. 360 డిగ్రీల్లో ఎక్కడి నుంచి తూటా దూసుకొచ్చినా సైనికుడికి ఏమీకాదు.
|
No comments:
Post a Comment