స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌కు సంబంధించిన నౌకాదళ వెర్షన్ కీలక పరీక్ష పూర్తి చేసుకుంది. ‘అరెస్టెడ్ ల్యాండింగ్' అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా విమాన వాహక నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఇలాంటి యుద్ధవిమానాన్ని రూపొందించే సత్తా కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగం గోవా తీరంలో జరిగింది. వేగంగా కిందకి దిగిన ఈ యుద్ధవిమానం తన కింది భాగంలో ఉన్న కొక్కేన్ని ప్రయోగ వేదికపై అమర్చిన తీగను విజయవంతంగా తగులుకొని స్వల్ప దూరంలోనే ఆగిపోయింది. దీంతో నౌకాదళంలోని విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై తొలిసారిగా ఇది దిగడానికి మార్గం సుగమమైంది. విశాఖపట్నంలో శ్రీలంక, భారత్ నౌకా దళాల సంయుక్త విన్యాసాలు (స్లైనెక్స్-19) విజయవంతంగా ముగిశాయి. తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్ ఖుక్రి, ఐఎన్‌ఎస్ సుమేధ, శ్రీలంక తరపున సింధురాల, సురనిమిల ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.ఒక నవజాత కృష్ణబిలం నుంచి వెలువడిన గురుత్వాకర్షణ తరంగాలను తొలిసారిగా గుర్తించడంతోపాటు జేగంట శబ్దాన్ని పోలిన ఆ తరంగాల్లోని స్వర స్థాయులను శాస్త్రవేత్తలు నమోదు చేశారు. వాటి ఆధారంగా ఆ కృష్ణబిల ద్రవ్యరాశి, భ్రమణాన్ని లెక్కకట్టగలిగారు. దీంతో విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన సూత్రాన్ని ధ్రువీకరించినట్లయింది. కృష్ణబిలాల్లోని ద్రవ్యరాశి, భ్రమణం, విద్యుదావేశం అనే మూడు లక్షణాలను మాత్రమే పరిశీలించడం సాధ్యం. మిగతా లక్షణాలను ఆ కృష్ణబిలమే స్వాహా చేస్తుంది. అందువల్ల వాటి ఆచూకీ దొరకదు. అందుకే ద్రవ్యరాశి, భ్రమణం ఆధారంగానే కృష్ణబిలం తీరుతెన్నులను విశ్లేషిస్తుంటారు. ఇప్పుడు ఆ ద్రవ్యరాశి, భ్రమణాన్ని గురుత్వాకర్షణ తరంగాల స్వర పోకడల ఆధారంగా లెక్కించారు. నిర్దిష్ట ద్రవ్యరాశి కలిగిన కృష్ణబిలం మాత్రమే ఒక విధమైన ఆరోహణ, అవరోహణ కలిగిన ‘స్వరాల'ను వెలువరిస్తుందని ఐన్‌స్టైన్ సాపేక్ష సిద్ధాంతం చెబుతోంది. తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఆ స్వర పోకడల ఆధారంగా కృష్ణబిలం ద్రవ్యరాశి, భ్రమణాన్ని లెక్కించారు. సదరు కృష్ణబిలానికి సంబంధించి గతంలో సేకరించిన లెక్కలతో అవి సరిపోలాయి.
|
No comments:
Post a Comment